బట్టతల ప్రియుడు

వాసంతి వసంత్ ఇద్దరూ కాకినాడ లో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాసంతి మంచి అందగత్తె, వసంత్ కూడా అందగాడు... ఉంగరాల జుట్టు వాడు. కానీ చదువు పూర్తి అయ్యాక వాసంతికి హైదరాబాద్లో ఉద్యాగం వచ్చింది, వసంత్ కి బెంగళూరు లో జాబ్ వచ్చింది. ఐదేళ్ళు గడిచిపోయాయి... ఎప్పుడూ వాట్సాప్ చాట్ చేసుకోవడమే గానీ ముఖాముఖాలు చూసుకోలేదు. కనీసం వీడియో కాల్ కూడా చేసుకోలేదు.

ఇంతలో వాసంతికి వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోమని తొందర పెట్టడం స్టార్ట్ చేసారు. వాసంతికి టెన్షన్ పట్టుకుంది. తమ ప్రేమ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. వసంత్ తో మాట్లాడి ఎప్పుడు వచ్చేదీ కన్ఫర్మ్ చేయమని చెప్పారు వాసంతి పేరెంట్స్.

ఏంటి వాసంత్ ఐదేళ్ళు దాటిపోయాయి. నిన్ను చూసి ఇదుగో వస్తానంటావు గాని హైదరాబాద్ రావు, కనిపించవు. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? వేరే వెతుక్కుంటూ ఉన్నావా? తొందరగా మన విషయం మా వాళ్ళకి చెప్పాలి.
అంది వాసంతి 

నేను మీ పేరెంట్స్ కి వచ్చి చెప్తాను గానీ... నాకు భయంగా ఉంది వాసంతి. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. అని జంకుతూ అన్నాడు వసంత్

ఏం ఎందుకు ఒప్పుకోరు అనుకుంటున్నావ్. నేను ఇష్టాన్ని మావాళ్ళు కాదనరు. అంది వాసంతి.

నీకు తెలీదు వాసంతి... మీ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. అసలు నా భయం ఏమిటంటే నువ్వు కూడా ఇష్టపడతావో లేదోనని అన్నాడు మరింత జంకుతూ.

నీకేమైనా పిచ్చా... ఎందుకలా భయపడుతున్నావ్ అంది వాసంతి.

ఎందుకంటే... ఎందుకంటే... నాకూ... బట్టతల వచ్చేసింది. ఇప్పుడు నాకు ఉంగరాల జుట్టు లేదు. నీకు నా ముఖం చూబించాలంటేనే భయంగా ఉంది. చూస్తూ చూస్తూ ఈ బట్టతల కుర్రోడ్ని పెళ్ళి చేసుకుంటానని ఎలా ఒప్పించగలవు వాసంతి మీ వాళ్ళని. అన్నాడు బాధగా వసంత్

వాసంతి చిన్న నవ్వు నవ్వింది. నీకు బట్టతల వచ్చిందని నాకు తెలుసు వసంత్. మొన్న మా స్నేహితురాలి పెళ్లి ఫోటోలలో నువ్వు కనిపించావు. నిన్ను మా వాళ్ళకి ఆల్రెడీ చూపించాను. అంది.

మరి మీ వాళ్ళు ఏమీ అనలేదా... అడిగాడు వసంత్ 

ఎందుకు అంటారు వసంత్. జుట్టు ఇవాళ ఉంటే రేపు ఉండదు... నేను ఇష్టపడింది నిన్ను గానీ నీ జుట్టుని కాదు. మా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు మీ వాళ్ళతో ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు... ముహుర్తాలు పెట్టుకొని పెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి కదా.

వాసంతి అలా మాట్లాడుతూ ఉంటే వసంత్ నమ్మలేకపోయాడు. అందంకోసం ప్రాకులాడే ఈ జెనరేషన్ లో కూడా బంధాలకు విలువనిచ్చే వాసంతి లాంటి వాళ్ళు తనకు భార్యగా రావడం ఎంతో అదృష్టం అనుకుంటూ... తన నెత్తి మీద విగ్గుని తీసి డస్ట్ బిన్ లో పడేసి, ఒక సెల్ఫీ తీసుకుని తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఫొటో అప్డేట్ చేసుకున్నాడు. అవును మరి దాపరికం లేకుండా ఎలా ఉన్నామో అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది.

Comments

Popular Posts