బ్రతుకు తెరువు

సూర్యంపేట గ్రామంలో బ్రహ్మం అనే ఒక వడ్రంగి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అతనికి నిత్యం చేతినిండా పని ఉండేది. నాగలి కొయ్య, ఎడ్లబండి, బండి చక్రాలు, ఇళ్ళ తలుపులు, ద్వారబంధాలు, ఒకటేమిటి... చెక్కపనికి సంబంధించిన పనులన్నీ బ్రహ్మం కుటుంబమే చేసేది. 

గ్రామస్తులంతా బ్రహ్మం కుటుంబాన్ని చాలా ఆదరించేవారు. ఎందుకంటే కులవృత్తిని నమ్ముకున్న ఆ కుటుంబం ధనానికి వెంపర్లాడకుండా ఊరి అవసరం కోసం పనిచేసేది. ఊరి వాళ్ళు కూడా బ్రహ్మం కూటుంబానికి ఏలోటూ లేకుండా చూసుకునేవారు. 

కానీ కాలం మారిపోయింది... బ్రహ్మం ముసలి వాడయ్యాడు. ఓపిక తగ్గిపోయింది. అతని కొడుకులు మాత్రం అదే వృత్తిలో పని చేస్తున్నారు... ఇప్పుడు ఊరు కూడా ఇదివరకటిలా లేదు. చాలా మారిపోయింది. ఊరి జనం కూడా మారిపోయారు. మునుపటి మంచితనం, సహకారం ఇప్పుడు వారిలో కనిపించడం లేదు. 

ఎందుకంటే... ఎడ్లబళ్ళ అవసరం తగ్గిపోయింది. ట్రాక్టర్ల వాడకం పెరిగింది. నాగలి అవసరం లేకుండానే పొలం దున్నే వ్యవస్థ వచ్చేసింది. ఇళ్ళకు వాసాలు కమ్మీలు అవరం తగ్గిపోయింది. కిటికీలు, ద్వారబందాలు, తలుపులు తప్ప మిగతాదంతా సిమెంటు, కాంక్రీటు పనే.

పైగా రెడీ మేడ్ తలుపులకు, ఫర్నీచర్ కు గ్రామ ప్రజలు ఆసక్తి చూపడం మొదలయింది.

ఒరే. మనవడా... ఇంక మన ఊర్లో ఈ వృత్తిమీద ఆధారపడి బ్రతకలేమురా... నేను, మీ నాన్న, బాబాయిలు ఊరుదాటి పోలేం... కానీ నువ్వు కుర్రాడివి. బడ్లో నాలుగు అచ్చరం ముక్కలు చదివినోడివి. నువ్వు బస్తీ పోరా... అన్నాడు తాత తన మనవడు దేవయ్యతో 

నేను బస్తీ పోతే మిమ్మల్ని చూసుకొనే దెవరు తాతా... నేను ఈడనే ఉంటా... నువ్వుండ్లా? మా అయ్యుండ్లా? నేనూ గట్లనే ఉంటా అన్నాడు దేవయ్య.

అట్ల గాదురా... నామాట ఇను.

ఆడ చేతినిండా పని దొరుకుతాది. ఈడ నువ్వు చేతి పనిముట్లతో పని చేసి ఏం జేస్తవ్. బస్తీకి పోతే ఆడ యంత్రాల మీద పని చేయొచ్చు. రంపం కాడ్నించి మేకులు దింపేటానికి, రంధ్రాలు ఎట్టేదానికి, చిత్రీ పట్టేదానికీ అన్నిటికీ కరెంటు మిషన్లు ఉంటాయి. పోయి ఆ పనులు నేర్చుకో... ఆ యంత్రాల పనితనం తెలుసుకో. ఈడ మనకింక పని దొరకదు. అంటూ చెప్పాడు తాత బ్రహ్మం.

అప్పుడు దేవయ్య తండ్రి తాత మాటను బలపరుస్తూ ఇలా అన్నాడు.

అవునురా దేవా... తాత చెప్పేది ఇనుకో... పట్నంలో మనబోటోల్లు పనిచేసే కానికి ఎల్లి పని నేర్చుకో. ఆల్లు ఇచ్చే జీతం కోసం కాదు. ఇచ్చేటి పని కోసమే పని చేయి. పని బాగా వచ్చినంక నీ సొంత పెయత్నాలు సేసుకోవచ్చు అన్నాడు తండ్రి కిట్టయ్య.

దేవయ్య ఆలోచిస్తున్నాడు. ఇంతకుముందు ఎన్నడూ పట్నం పోయి ఎరుగడు. 

తనలో తానే అనుకుంటున్నాడు... అక్కడ ఏడ ఉండాలి? ఎట్టా బతకాలి? ఎవరు పనిస్తారు...

దేవయ్య మనసులో సందేహాలని పసిగట్టాడు తాత. 

నీకు పది దినాలు కడుపుకు తిని బతకడానికి కావలసిన పైసలు ఇస్తా. కావలసిన బట్టలు, సబ్బు, పళ్ళుదోము పుడకలు తీసుకుపో... నీ పని పొద్దుగూకులా పని ఏడు దొరుకుతాదో ఎతకడమే... నీ పెయత్నంలో పట్టుదల ఉంటే దేవుడే నీకు దారి సూపిత్తాడు. దేవుడ్ని నమ్ముకో. అన్నాడు తాత.

అరేయ్ దేవా... ఈటితో పాటూ మన పనిముట్లు తీసుకుపో... పట్నంలో నీకు సేతికి ఎంటనే పని కుదరక పోయినా... గల్లీల్లో తిరిగితే ఇండ్లకాడ సిన్నా సితకా పను పట్టుకోవచ్చు. మంచితనముంటే మడుసులే దేవుల్లవుతారు. అన్నాడు తండ్రి కిట్టయ్య.

రెండు రోజులు ఇంట్లో అందరితో సంతోషంగా గడిపిన దేవయ్య, మంచిరోజు చూసుకుని పట్నం బయలుదేరాడు.

దేవయ్యకు పదహారేళ్ళు. గ్రామంలో పదవ తరగతి వరకూ చదివాడు. అంతకుమించి చదివే స్తోమత లేదు. కులవృత్తినే దైవంగా భావించే కుటుంబం వాళ్ళది. 

ఊరి పొలిమేర దాటి రెండు కిలోమీటర్లు నడిచాక అక్కడ పట్నానికి పోయే బస్సులు ఆగే స్టాప్ ఉంది. అక్కడ వరకూ కాలినడకన వెళ్ళి నిల్చున్నాడు దేవయ్య... ఒక గంట గడిచాక పట్నం వెళ్ళే ఒక బస్సు ఒకటి వచ్చింది.

పట్నం చేరుకున్నాడు దేవయ్య. అక్కడ పల్లెలో ఉండే ప్రశాంతత అగుపడ లేదు. వచ్చీపోయే వాహనాలతో, హోరెత్తి పోతోంది. సామాను మోసుకుంటూ రోడ్డు ప్రక్కనుండి నడుచుకుంటూ పోతున్నాడు దేవయ్య. అతడికి ఎవ్వరూ తెలియదు. ఎక్కడ ఆగాలో తెలియదు. ఎక్కడ ఉండాలో తెలియదు. 

దేవుడా... నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించు... అనుకుంటూ నడుస్తున్నాడు.

చాలా దూరం నడిచాక బాగా అలిసిపోయాడు. సామాను క్రిందకు దింపి, ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. చాలా దాహంగా ఉంది. ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూడాలి. సామాన్లు అక్కడ పెట్టి వదిలి వెళ్ళాలంటే భయంగా ఉంది అతడికి. 

ఎవరు ఎలాంటి వారో తెలియని ఊరాయె

కొంతసేపటికి... తోపుడు బండితో తోసుకుంటూ పళ్ళు అమ్మే ఒక వ్యక్తి వచ్చి, చెట్టు ప్రక్కనే ఆగాడు. అతడిపేరు చంద్రయ్య. అది అతడు రోజూ పళ్ళు అమ్ముకునే చోటు. 

మరో అర్థగంట గడిచాక అతడే దేవయ్య వైపు చూసి ఊరినుండి వచ్చావా తమ్ముడూ? అని అడిగాడు. అవునని చెప్పాడు దేవా. 

ఏడకిపోవాలి? అడిగాడు ఆ వ్యక్తి.

తెలియదు. నాకు పట్నం కొత్త. అన్నాడు దేవయ్య.
ఓ పదినిమిసాలు బండి కాడ ఉంటావా. ఇప్పుడే చాయ్ తాగి వస్తా అన్నాడు చంద్రయ్య. 

సరే అన్నాడు దేవా... చంద్రయ్య చాయ్ తాగి పావుగంట గడిచాక తిరిగి వచ్చాడు. 

నువ్వు కూడా పోయి చాయ్ తాగి రా... నీ సామాను బండికాడనే ఎట్టుకో... నేను సూత్తాలే... భయపడకు. అన్నాడు.

ఈడ నుండి సూటిగా ముందుకెల్లి కుడివైపు మళ్ళితే చిన్న హొటేలు అగుపడుద్ది. నీకు ఆకలేస్తే ఏదైనా తిని రా. అన్నాడు ఆ వ్యక్తి.

సరే అని సామాను బండి క్రింద పెట్టి... చంద్రయ్య చెప్పిన చోటుకి వెళ్ళాడు దేవయ్య. నోరు బాగా పుక్కిలించుకుని, గుక్కెడు నీళ్లు తాగి, టిఫిన్ తిని టీ తాగి... తిరిగి వచ్చాడు.

ఇప్పుడు ఏడకి పోతుండావు... అడిగాడు ఆ వ్యక్తి శ్యామయ్యని

తెలియదు... ఏడైనా పని దొరుకుతుందేమో ఎతుక్కోవాలి. అన్నాడు దేవా.

ఏ పని సేత్తావ్...? అడిగాడు ఆ వ్యక్తి.

వడ్రంగి పని అన్నాడు దేవయ్య. 

గిలా చూడు... గీ సామాను మోస్తూ పని ఏడ వెతుకుతావ్... పొద్దుగుంకే వరకూ ఈడనే నాతో ఉండు. సాయంత్రం బండి ఖాళీ అవుద్ది. నీ సామాను బండి మీద ఎట్టుకొని నాతో పాటూ నేనుండే కాడికి రా. 

నేనుండే కాడ ఒక షెడ్డు ఖాళీగా ఉంది. నువ్వు ఆడనే ఉండొచ్చు. రాత్రికి ఆడనే పడుక్కుని రేపు పొద్దుగాలే లేచి పని ఎతుక్కో. మా ఇంటి లోనే ఒక ప్రక్క నీ సామాను పెట్టుకుందువులే. మా ఇల్లాలు చానా మంచిది. నీ సామాను భద్రంగా చూస్తది. ఫికరు కామాకు అన్నాడు చంద్రయ్య 

నా పేరు దేవా... నీ పేరు? అడిగాడు దేవయ్య ఆ వ్యక్తిని. 

నాపేరు చంద్రయ్య. అన్నాడు వ్యక్తి.

సాయంత్రం వరకూ అక్కడే కాలక్షేపం చేసాడు దేవయ్య.
చీకటి పడింది. పండ్ల బండి ఖాళీ అయింది. 

ఈదినం యాపారం బాగా నడిసింది . మొత్తం అన్ని పళ్ళూ అమ్ముడైనాయి. పద ఇంటికి పోదాం అన్నాడు చంద్రయ్య.

ఇద్దరూ నడుచుకుంటూ చంద్రయ్య ఇంటికి వెళ్తున్నారు. 

సూడు దేవా నీ వయసులో నేను కూడా ఈ బస్తీకి నీకుమల్లే వచ్చినోడినే... నన్ను నీలో సూత్తుండా. అన్నాడు చంద్రయ్య.

అలాగా నీసంగతి చెప్పు... వినాలని ఉంది. అడిగాడు దేవయ్య. 

నేను నా అనేవారు ఎవరూ లేని ఏకాకిని. పన్నెండేళ్ళ వయసులో ఈ బస్తీలో అడుగు పెట్టినా. గెట్లా బ్రతకాలో తెలియకపాయె. ఏ పనీ సేతకానోడ్ని. దూరంగా గుడి గంటల శబ్దం వినిపించింది. దేవుడికి దండమట్టుకుంటే దేవుడే సూత్తాడ్లే అని ఎళ్ళాను. ఆ సమయంలో ఆడ పెసాదాలు ఇస్తుండ్రు. పెసాదం తిని, నీళ్ళు తాగి కడుపు నింపుకున్నాను... 

మధ్యాహ్నం ఇక్కడ ప్రతీరోజూ అన్న సంతర్పణ ఉంటుంది. ఇక్కడే ఉండి తిని వెళ్ళు... అనే మాట వినిపించింది. 

ఎవరో ఎవరికో సెబుతున్న మాట అది. దేవుడు నాకే సెప్పినట్లు అనిపించింది.

నేను గుడి బయటకు వచ్చి మధ్యాహ్నం వరకూ ఆడనే ఉంటానని దండవెట్టుకుని గుడి బయట గోడకి ఆనుకుని బైఠాయించినా. కొందరు భక్తులు నేను కూర్చున్న కాడకి వచ్చి, చెప్పుల్ని విడిచి, తిరిగి వచ్చినాక పైసలు ఇచ్చారు... నాకు ఆ దేవుడే దారి సూపినట్లయింది.

ఇంక ఆ గుడే నాకు నీడ అయ్యింది. పొద్దుగాలే ఎల్లి ఆడనే కూర్చునే వాడిని. చెప్పులని కాపుగాసి పైసలు తీసుకునే వాడిని. ప్రొద్దుట ప్రసాదం, మధ్యాహ్నం అన్నదానంతో ఆడనే గడిచిపోయేది. రాత్రి నాకు చెప్పులు చూసినందుకు దొరికిన దుడ్లతో ఏదోఒకటి తిని గుడి కాడనే వాలే వాడిని.

రెండు నెలలు గడిచినాయి. ఒకనాడు మధ్యాహ్నం రోజూ నా ప్రక్కనే తోపుడు బండి పెట్టుకుని పళ్ళు అమ్మే ఒక అవ్వకి కడుపు నొప్పి వచ్చినాది. ఆ నొప్పి సానా ఎక్కువ కావడంతో కూలబడినాది. ఎంటనే నేను ఆ అవ్వని అదే తోపుడు బండి మీద సర్కారు దవాఖానాకి తీసుకుపోయుంటిని. దవాఖనలో అవ్వకి వైద్యం చేసి మందులు ఇచ్చినారు డాక్టర్లు. 

అవ్వ నావైపు సానా కృతజ్ఞతగా చూసింది. 

రెండు నెలలుగా నిన్ను సూత్తా ఉన్నాను. రోజంతా గుడి కాడనే ఉంటున్నావు. ఎవరు నువ్వు? ఏ ఊరు? అడిగింది అవ్వ. 

నేను నా గురించి అంతా చెప్పుకున్నాను అవ్వకి.

రెండు రోజుల గడిచినాక అవ్వ నా కాడకు వచ్చి, నాకింక సేతనైతా లేదు. గిట్లా దినాము పండ్లమ్ముకునే పని సెయ్యలేను. నాకు ఒక సాయం చేస్తావా? అని అడిగింది. 

ఏమిటో చెప్పు చేస్తాను అని సమాధానం ఇచ్చాను.

నా పెనిమిటి పెండ్లయిన ఐదేండ్ల నాటికే దేవుని కాడికి ఎల్లిపోయిండు. నాకు ఇద్దరు బిడ్డలు. కష్టపడి పనిచేసి, ఆళ్ళని చదివించి పెళ్ళిళ్ళు జేసినా. ఒక మనవరాలు పుట్టింది.

ఒకనాడు పుష్కరాలకు అందరం కలిసి ఎల్లినాం. అది తొలిరోజు కావడంతో జనం సానా మంది వచ్చి త్రొక్కిసలాట జరిగినాది. ఆ పెమాదంలో నా కొడుకులు, కోడళ్ళు సనిపోయిండ్రు. మనవరాలిని ఎంటేసుకుని నేను రద్దీ లేని కాడ నిలబడినా... అందువల్ల నేనూ నా మనవరాలు బ్రతికినాం.

ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నష్ట పరిహారంతో నా మనవరాలిని చదివిస్తూ... తోపుడు బండి తోసుకుంటూ వచ్చి ఈ గుడి కాడ పండ్లు అమ్ముతూ ఉన్నాను... ఇప్పుడు చూస్తాఉంటే నా పేనం అంత బాగాలేదని అనిపిస్తాంది. ఇకమీదట నేను ఈ యాపారం చేయలేను. నీకు కూడా ఎవ్వరూ తోడు లేరు కదా... నాతో నా ఇంటనే ఉంటావా... ఈ యాపారం నువ్వే సేసుకో... నీకూ దారి దొరకుతాది, నీ తోడువల్ల మాకూ మేలు జరుగుతాది. నిన్ను నేను నమ్ముతున్నాను. అంది.

నేను మారు ఆలోచన లేకుండా సరే అన్నాను. ఇది కూడా దేవుడి మాటే అని భావించినాను. ఐదేళ్ళు గడిచినాయి. ఒకరోజు అవ్వ మంచం పట్టినాది. వైద్యం మంచిగా చేయించినా... అయినా తగ్గలేదు. 

చంద్రయ్యా... ఇంక నాకు దేవుడి పిలుపు వచ్చేసినాది. నాకు ఒక మాటిస్తావా? అడిగింది... 

ఏమిటో చెప్పమన్నాను... 

నా మనవరాలు వెన్నెలని మనువాడతావా? అది సానా మంచిది. మీ ఇద్దరూ ఒకటైతే నాకు ఏ దిగులూ ఉండదు. అని అడిగింది.

వెన్నెల మనసు తెలుసుకోకుండా ఎట్లాగవ్వా... అన్నాను

వెన్నెల కూడా సరేనంది... దానిని అడిగినాకే నీకీ మాట సెపుతున్నాను. అంది అవ్వ.

అలా వెన్నెలని పెళ్ళి చేసుకుని ఈ పళ్ళ యాపారం నడుపు కుంటున్నాను. అంటూ తన గతాన్ని చెప్పుకొచ్చాడు చంద్రయ్య.

నీ గతం నాకు జీవితం మీద ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తోంది... అది సరే... మరి గుడికి దూరంగా చెట్టు క్రింద ఉన్నావేం? అడిగాడు దేవయ్య.

ఓ... అదా... గత నెల రోజులుగా ఆ గుడి వీధిలో రోడ్డు పని జరుగుతావుంది... బండి తోసుకుపోటానికి అయితా లేదు. అని చెప్పాడు చంద్రయ్య.

ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే చంద్రయ్య ఇల్లు వచ్చింది. భార్య వెన్నెలకి శ్యామయ్య గురించి చెప్పాడు.

మంచిపని చేసినావయ్యా... రేపు ఆ దేవుడికి దన్నమెట్టుకుని నీ పెయత్నాలు మొదలుపెట్టు. నీకు దారి దొరికే వరకూ... ఆ రేకుల షెడ్డులో ఉందువు గానిలే. అని చెప్పింది వెన్నెల.

మరుసటిరోజు ప్రొద్దుటే స్నానం చేసి, దేవుడి దర్శనం చేసుకున్నాడు. పనిముట్లు తీసుకుని పనికోసం ఊర్లోకి బయలు దేరాడు దేవయ్య. రోజంతా తిరిగాడు ఎక్కడా పని దొరకలేదు. దిగులుగా ఇంటి ముఖం పట్టాడు.

మూడు రోజులు గడిచాయి... చేతిలో తాత ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చయి పోతున్నాయి. అయినా ప్రయత్నం ఆపలేదు.

దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. అంటూ పాట వినిపిస్తోంది... ఆ పాట వింటూ పని వెతకడానికి బయలుదేరాడు దేవయ్య.

రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఒక మోటార్ బైక్ వెనుక నుండి వచ్చి శ్యామయ్యని ఢీ కొట్టింది... దేవయ్య క్రింద పడిపోయాడు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే బైకుని ప్రక్కన పెట్టి, ఆ బైకు నడిపిన వ్యక్తి దేవయ్యను ఒక ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళి గాయాలకు కట్టు కట్టించాడు. కొంత డబ్బు చేతిలో పెట్టి... నా వల్ల తప్పు జరిగిపోయింది సారీ బాబూ అన్నాడు. 

పర్వాలేదండీ... కట్టు కట్టించారు కదా డబ్బులు ఎందుకు ఉంచుకోండి అంటూ తిరిగి ఇవ్వబోయాడు దేవయ్య. 

ఆ నెమ్మదితనం ఆ వ్యక్తికి నచ్చింది.

నువ్వు ఎవరు? ఎక్కడుంటావు? ఇదిగో నీ సంచి... ఏమున్నాయి ఇందులో ఇంత బరువుంది? అన్నాడు ఆ వ్యక్తి.

వడ్రంగి సామాను... అని బదులిచ్చాడు దేవయ్య. 

అలాగా.... నువ్వు కార్పెంటరువా? నేను కూడా కార్పెంటర్నే... ఇక్కడికి దగ్గర్లో నాకు ఉడ్ వర్క్ షాప్ ఉంది. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావ్? అడిగాడు ఆ వ్యక్తి.

నాకు ఎక్కడా పని దొరక్క పనికోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాను మా ఊరు సూర్యం పేట. అని బదులిచ్చాడు దేవయ్య. 

ఓహో... సూర్యం పేట కుర్రాడివా? అక్కడ బ్రహ్మం తాత ఉంటాడే... తెలుసా అని అడిగాడు ఆ వ్యక్తి. 

నేను బ్రహ్మం తాత మనవడిని అని చెప్పాడు దేవయ్య.

అలాగా... నేను చిన్నప్పుడు బ్రహ్మం తాత దగ్గర పని చేసేవాడిని... తర్వాత మా కుటుంబం పట్నం వచ్చి స్థిరపడింది. నువ్వు నాకు కావలసిన వాడివి. రారా షాపుకి వెళ్ళి మాట్లాడుకుందాం అని దేవయ్యను తనతో తీసుకువెళ్ళాడు ఆ వ్యక్తి.

ఆ షాపు చాలా పెద్దది... అక్కడ పదిమంది కార్పెంటర్లు పని చేస్తున్నారు... అందరూ కెరెంట్ మిషన్లు వాడుతూ ఫర్నీచర్ వర్క్ చేస్తున్నారు. ఆ వ్యక్తి దేవయ్యని వాళ్ళకి పరిచయం చేసాడు. ఈ అబ్బాయి ఈ రోజునుండి ఇక్కడే మనతోనే ఉంటాడు. ఇతడికి పని నేర్పి చేయించండి. అని చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు.

దేవయ్యా నా పేరు గోవింద్. నేను మీ తాతకు చెల్లించ వలసిన గురుదక్షిణ నీకు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా తీర్చుకుంటాను. పని బాగా నేర్చుకో... త్వరలోనే ఈ ఊరిలో నీచేత మరో షాపు పెట్టిస్తాను. ఇద్దరం కలిసి పని చేద్దాం అంటూ భుజం తట్టాడు. గోవింద్.

తర్వాత దేవయ్య చంద్రయ్య ఇంటికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు. 

సూసినావా... దేవుడు నీ ఎంటనే ఉన్నాడు. కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ తోడుంటాడు. నువ్వు సంతోషంగా వెళ్లి పని నేర్చుకో. గొప్పోడివై మీ తాతకు అయ్యకూ ఆనందం కలిగించు అంది వెన్నెల.

అప్పుడప్పుడు గుడి కాడకు వస్తూ ఉండు. ఆ దేవుడు సల్లగా చూస్తాడు. అని చెప్పాడు చంద్రయ్య.

వాళ్ళ దగ్గర శెలవు తీసుకుని గోవింద్ షాపుకి బయలుదేరాడు దేవయ్య. ఏడాది తిరిగే లోపు పని మొత్తం నేర్చుకున్నాడు. కరెంట్ పనిముట్లు వాడటంలో మెలకువలు అన్నీ నేర్చుకున్నాడు.

దేవయ్య పనితనాన్ని గోవింద్ చాలా మెచ్చుకున్నాడు. 
నీ వల్ల నాకు మంచి కాంట్రాక్టులు వచ్చినాయి. ఇప్పుడు నేను నీకు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటాను. 

ఊరి చివర ఎక్కువ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఉడ్ వర్క్ చాలా అవసరం. నీకు నేను లోన్ ఇప్పిస్తాను. అక్కడ ఒక షాప్ ఓపెన్ చెయ్యి. మొదట ఒక్కడివే చేసుకో చేతినిండా పని దొరికాక సహాయకులని పెట్టుకో. అన్నాడు గోవింద్.

పనులన్నీ చకచకా జరిగిపోయాయి... షాప్ ఓపెన్ చేయడానికి తన తాతని సూర్యంపేట నుండి తీసుకువచ్చాడు దేవయ్య. 
బ్రహ్మం తన శిష్యుడు గోవింద్ చేసిన ఉపకారానికి చాలా సంతోషించాడు.

షాప్ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే చాలా మంచి పేరు వచ్చింది. మంచి ఇల్లు అద్దెకు తీసుకుని తన కుటుంబాన్ని పట్నానికి తీసుకువచ్చాడు దేవయ్య. సంవత్సరం తిరిగే లోపు షాపు కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశాడు.

ఊరికి చెరోవైపు గోవింద్ దేవయ్యలు పని చేసుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నారు.

దేవయ్య అప్పుడప్పుడు చంద్రయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు తీరుస్తూ... గుడికి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. 

పనినే దైవంగా భావించే వాడికి దైవం ఎప్పుడూ అండగా ఉంటుంది.

ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి... ఈ ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ధన్యవాదాలు.




Comments

Popular Posts