జీవితమే ఒక ప్రవచనం
సూరిబాబు పనిమీద ఒక రోజు పట్నం వెళ్ళాడు. పట్నంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని, అక్కడ జరిగే వేడుకలు చూసి, రాత్రి తన రూముకి తిరిగి వెళ్ళేవాడు.
చివరి రోజున ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంటే పోయి కూర్చుని వింటున్నాడు.
ఆ ప్రవచన కారుడు ఇలా చెబుతున్నాడు... దేవేంద్రుడు, దేవతలు బండాసుర రాక్షసుల బలానికి తట్టుకోలేక అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు. దేవేంద్రుడు ఢీలా పడిపోయి కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య అతనికి ధైర్యం చెప్పి, అమ్మవారి శరణు కోరమంది. సరే అని దేవతలతో సహా దేవేంద్రుడు అమ్మవారి కోసం ప్రార్థనలు చేసాడు.
అప్పుడు అమ్మవారు కనికరించి కామేశ్వరీ దేవతగా వచ్చి భండాసురుని అంతం చేసింది.
కనుక ఎప్పుడూ నీకు కష్టాలు వస్తే కుమిలిపోతూ కూర్చోకు. అలా కుమిలిపోతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ చెబుతూ...
కష్టాలు అంటే ఏమిటి కల! అసలు ఈ లోకమే ఒక కల. మనం పుట్టడం ఒక కల. పెరగడం ఒక కల. సంసార జీవితం ఒక కల. పగలు కల. రాత్రి కల. రాత్రి నిద్రలో కలగనడం ఒక కల. మళ్ళీ మేల్కోవడం ఒక కల. బాధ్యతలూ, బరువులు మోయడం అంతా కలే. మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కలే అనుకుంటే కష్టాలు ఏముంటాయి నా బొంద. అంటూ ప్రవచించాడు.
సూరిబాబు కి ఆ ప్రవచనం చాలా నచ్చింది. నిన్నటి వరకూ ఉన్న ఆందోళన అంతా పోయింది. అవును... నేను వ్యవసాయం చేయడం ఒక కల . దానికోసం అప్పులు చేయడం ఒక కల. అప్పులు తీర్చలేక పోవడం ఒక కల. బ్యాంకుల చుట్టూ తిరగడం ఒక కల అని ఇలా తనలో తాను అనుకుని ధైర్యం చెప్పుకున్నాడు.
మరుసటి రోజు గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద రామయ్యని చూసాడు. రామయ్య చాలా దిగులుగా ఉన్నాడు. అప్పుడు సూరిబాబు రామయ్య బాధ పోగొట్టాలని, నిన్న తాను విన్న ప్రవచన జ్ఞానాన్ని రామయ్యకి ఉపదేశించడం మొదలు పెట్టాడు.
కాబట్టి ఇదంతా కలే అనుకున్నావనుకో... ఏ కష్టాలు ఉండవు... అంటూ ముగించాడు. అంతా ఉన్న రామయ్య ఒక్క ఉదుటున లేచి ప్రక్కనే కూర్చున్న సూరిబాబు తలపై యాభై కిలోల ఎరువుల బస్తా పెట్టాడు.
ఒరేయ్ ఎదవా... ఇంత బరువు పెట్టావేంటిరా దించరా... దించు అంటూ అరిచాడు సూరిబాబు ఆ బరువు తట్టుకోలేక.
అప్పుడు రామయ్య... ఈ బస్తా ఒక కల అనుకో... దీని బరువు ఒక కల అనుకో... అంతా తేలికై పోతుంది... మోసుకొచ్చి... నా ఇంటిదగ్గర దింపు అన్నాడు.
ఎలా తేలికవుతుందిరా... ఇంత బరువు ఉంటేనూ... అంటూ బాధగా అరిచాడు సూరిబాబు.
అదే మరి... ప్రవచనాలు చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటాయి. కష్టాలు కలే అనుకుంటే కలైపోతాయా? బాధ్యతలూ బరువులు మోసే వాళ్ళకి తెలుస్తుంది బాధ. అంటూ బస్తాని క్రిందికి దింపాడు రామయ్య.
మరి ఆ ప్రవచన కారుడు చెప్పింది తప్పంటావా? అడిగాడు సూరిబాబు.
తప్పో రైటో అనే తర్కం మనకెందుకు? మనం కష్టాల్లో ఉన్నామన్నది నిజం. వాటి నుండి బయటపడటానికి దారి చూసుకోవాలి అనేది నిజం. ఈ నిజం మాత్రం కల కాదు. మన కర్మలు మనం చేయక తప్పదు. చచ్చేవరకూ ఇదంతా నిజమే... చచ్చాక శాశ్వత నిద్రలోకి పోయినప్పుడే కల. అన్నాడు రామయ్య.
రామయ్య చెప్పింది పూర్తిగా అర్థం కాకపోయినా నిజమే అనిపించింది సూరిబాబుకి. ప్రవచనాలు వినడానికి బాగుంటాయి... కానీ బ్రతుకు బండి లాగే వాళ్ళకి... జీవితంలో కష్టాలను తాము ఎదుర్కొనే విధానమే ఒక పెద్ద ప్రవచనం. ప్రతి మనిషి జీవితం ఒక ప్రవచనమే.
కల లాంటి లోకంలో బ్రతుకుతున్న జీవితం మాత్రం చచ్చేవరకూ నిజం! అని అనుకున్నాడు సూరిబాబు.
దూరంగా ఘంటసాల పాట... కల ఇదనీ నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే... అంటూ వినిపిస్తుండగా... ఇంటి ముఖం పట్టాడు సూరిబాబు.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి