అశ్వినీ దేవతలు
అశ్వినీ దేవతలు!! వీరినే తథాస్తు దేవతలు అని కూడా అంటారు. వీరు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరు సూర్యునికి, సౌంజ్నకి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.
వీరిసోదరి పేరు ఉష. ఆమె ప్రతిరోజూ వీరి సోదరి వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.
అశ్వినీదేవతలు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథాన్ని మూడు గుర్రాలు నడుపుతుంటాయి.
అద్వరాశ్వాలనే ఆ గుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రథానికి చక్రాలు కూడా మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.
అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.
వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి.
వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.
అశ్వినీదేవతలు దేవతలే అయినా గానీ వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు.
వీరి గురించిన ఒక పురాణ కథ ఇలా చెప్పబడింది.
ఒకనాటి ప్రాతఃకాలంలో ఆకాశ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు నవయవ్వన సౌందర్య సోయగాలతో ముగ్ధమోహన రూపిణి యైన ఒక జగదేక సుందరి కొలనులో స్నానం చేస్తుండగా చూసి ఆమె వద్దకు వస్తారు.
వారు ఆమెను ఎవరివని అడిగితే... తన పేరు సుకన్య అని, చ్యవన మహర్షి భార్యనని చెబుతుంది. వారు చ్యవన మహర్షిని చూస్తారు. ఆ మహర్షి వయో వృద్ధుడు పైగా గుడ్డివాడు.
అతనిని వివాహం చేసుకోవలసిన పరిస్థితి ఈ నవమోహన సుందరాంగికి ఎలా దాపురించిందని అడుగుతారు.
అప్పుడు ఆమె తన పూర్వాపరాలను ఇలా వివరిస్తుంది.
ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతికి ఒక కుమారుడు, కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా చేరు కొంటాడు.
ఆ సరొవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశు పక్ష్యాదులు ఉండేవి. ఆక్కడే ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకొంటుండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలి చీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టు చేరడం వలన చ్యవన మహర్షి ఒక మట్టి ముద్ద వలే కనిపించేవాడు. శర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారం జరుపుతూ చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చ్యవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగు వలే సుకన్యకు కనిపిస్తాయి.
సుకన్య అది ఒక పురుగు వలే ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన చ్యవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకొంటున్నానని తనని పుల్లతొ పొడవద్దని వారిస్తాడు. కాని ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతొ చ్యవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది, చ్యవనుడి కంటి చూపు పోతుంది.
కంటి చూపు పోవడంతో చ్యవన మహర్షి కోపించి, శర్యాతి సైనికులకు, మంత్రులకు, శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు. మలమూత్రాలు బంది అవడంతో తాను చింతుడై ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెబుతుంది.
అప్పుడు విషయం గ్రహినంచిన శర్యాతి సకల పరివారంతో అడవి వెళ్లి మహర్షిని కలిసి అపచారాన్ని మన్నించమని వేడుకుంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంత చిత్తుడై తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్యని తనకిచ్చి వివాహం జరపమంటాడు. దానికి శర్యాతి సంకోచిస్తుండగా సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగింది కనుక ఆ అపచార నివృత్తి చ్యవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారా తీరుతుందని చెబతూ తన వివాహం చ్యవన మహర్షితో జరపించమని తండ్రికి చెబుతుంది.
వివాహం జరిగాక చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుతుంది సుకన్య. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటూ ఉంటోంది.
ఆమె కథ పూర్తిగా విన్న అశ్వినీ కుమారులు
అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించవచ్చు కదా అని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది.
అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు.
ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడాడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు.
అప్పుడు యవ్వనవంతుడైన చ్యవనుడు ఇంద్రునితో యుద్ధం చేసి, ఇంద్రుని ద్వారా సూర్య కుమారులైన అశ్వనీదేవతలకు యజ్ఞాలలో హవిస్సులు సోమరసాన్ని ఇప్పిస్తాడు.
చ్యవన మహర్షి తండ్రి భృగు మహర్షి. చ్యవన మహర్షి వృత్తాంతం మహాబారతం, దేవీ భాగవతం, అష్టాదశ పురాణములో చెప్పబడింది.
అశ్వినీ దేవతలు పేరిట నక్షత్రములు ఉన్నాయి. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. మిథున రాసి లోని కేస్టర్, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి.
అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహానికి వైద్యసేవ చేయుచుండునట్లు ఋగ్వేదములో చెప్పబడింది. వీరు
వీరు పశువైద్యము గూడ చేసేవారని, శయుడనే ఋషియొక్క గోవు ఈనలేని స్థితిలో ఉండగా, వీరు దానిని ఈనునట్లు సహాయపడ్డారని, రేభుడు, నందనడను ఋషులను రాక్షసులు హింసించగా వారిని రక్షించారని, తుభ్యుడు, అంతకుడు అను వారిని గూడ రక్షించారని, పరావృజుడనే ఋషికి కాళ్ళు పోగా కొత్త కాళ్ళు అమర్చారని,
ౠజాశ్వుడనే అంధుడికి కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసారని, ఖేలుని భార్య అయిన విశ్వలాయువతికి యుద్ధంలో కాళ్ళు విరిగిపోతే, లోహపు కాళ్ళు అమర్చారని, కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చారని ప్రతీతి.
పాండురాజు రెండవ భార్య మాద్రికి నకుల సహదేవులను పుత్రులుగా ఇచ్చారని, అత్రి మహాఋషిని రాక్షసులు ఎత్తుకుపోయి ఒక యంత్రగృహంలో బంధించి వేధిస్తుండగా, ఆతనిని ఆ చెరనుండి విడిపించారని, శయుడు, శర్యుడు, శర్యాతుడను అనే పురాణ పురుషులకు కావలసిన సాయములెన్నో చేసారని, విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని తమ వైద్యశక్తితో రక్షించారని అనేక కథలు పురాణాల్లో చెప్పబడ్డాయి.
ఇందులో భుజ్యుడు సముద్రంలో ప్రయాణిస్తూ ఓడలో నుండి మునిగిపోతున్నపుడు వీరు కాపాడారట.
కక్షివంతుడి కూతురు ఘోషకు కుష్టురోగాన్ని నయం చేసారట,
వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసారట.
అంధుడైపోయిన కణ్వఋషికి కళ్ళు బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసారట.
వేదుడనే రాజు శత్రువులతో జరిగిన యుద్ధంలో గాయపడగా ఆతనిని రక్షించారట.
ఈ విధంగా అశ్వినీ దేవతల గురించిన పురాణ కథలు ఎన్నో ఉన్నాయి.
Comments
Post a Comment