ఛిన్నమస్తిక


హిందూమతంలోని తాంత్రిక దేవతలలో ఛిన్నమస్త ఒక ముఖ్యమైన దేవత. ఈమెను ఛిన్నమస్తిక, ప్రచండ చండిక, జోగిని, అని కూడా పిలుస్తారు. ఛిన్నమస్తా దేవిని శక్తి యొక్క రౌద్ర రూపంగా కొలుస్తారు. ఛిన్నమస్త అనగా "ఖండింపబడిన శిరస్సు " అని అర్ధం. ఈ హిందూ ఆధ్యాత్మిక అమ్మవారు భీతికరమైన ప్రతిరూపంతో చిత్రీకరింపబడినది. 

ఈమె దశ మహావిద్యలలో ఒకరు , తంత్ర రహస్య సంప్రదాయం నుండి పది మంది దేవతలు మరియు హిందూ మాతృ దేవత మహాదేవి యొక్క ఉగ్రమైన రూపం. స్వయంగా శిరచ్ఛేదం చేసుకున్న నగ్న దేవత, సాధారణంగా దైవిక సంభోగ జంటపై నిలబడి లేదా కూర్చుని , ఒక చేతిలో తన తెగిపోయిన తలను మరియు మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుంటుంది . ఆమె స్వీయ ఖండితం చేసుకున్న మెడ నుండి మూడు రక్తపు ధారలు చిమ్ముతూ బయటకు వస్తాయి. ఆమెకు ఇరువైపులా సేవకురాళ్ళయిన ఇద్దరు నగ్న యువతువతులతో సహా ఆమె ఖండిమైన శిరస్సు కూడా ఆ రక్తధారలను తాగుతూ ఉంటుంది.

ఛిన్నమస్తా టిబెటన్ బౌద్ధ దేవత వజ్రయోగిని  యొక్క తెగిపోయిన తల రూపం అయిన చిన్నముండాతో దగ్గరి సంబంధం కలిగి ఉంది .

ఈ శక్తి రూపాన్ని నేపాల్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కొలుస్తారు.

ఆమె జన్మదినాన్ని "ఛిన్నమస్త జయంతి"గా జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్ధశి నాడు వస్తుంది. 

స్వీయ-శిరచ్ఛేదం చేసుకున్న ఈమె ఒక శక్తిపీఠ దేవత. ఛిన్నమస్త ప్రాణదాత మరియు ప్రాణహర్త. మహావిద్యాలలో ఒక దేవతగా కొలువబడే ఈమెను లైంగిక వాంఛపై స్వీయ నియంత్రణకు చిహ్నంగా లైంగిక శక్తిస్వరూపిణిగా భావిస్తారు.

ఇంతకూ ఈ దేవత స్వీయ శిరచ్ఛేదం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ ఒక కథ చెప్పబడింది.

ఆ ప్రసిద్ధ కథ ప్రకారం, పార్వతీ దేవి తన సేవకురాళ్లైన ఢాకిని మరియు వర్ణినిలతో కలిసి నదిలో స్నానం చేస్తున్నప్పుడు, వారిద్దరూ ఆకలితో ఉన్నారని కోరారు. వారి ఆకలి తీర్చడానికి, పార్వతి తన తలనే ఖండించుకుని, తన మెడ నుండి వచ్చే మూడు రక్తపు ధారలను తాను, తన సేవకురాళ్లకు త్రాగిస్తూ ఉంటుంది. ఈ సంఘటనతో ఆమె "ఖండించిన తల" (Chinnamasta) అనే రూపం పొందింది. 

ఛిన్నమస్తను జీవితచక్రం లోని మూడు దశలైన జన్మ, రతి మరియు మృత్యువు అనే దశలకు చిహ్నాలుగా మూడు రూపాంతరాలలో సేవిస్తారు. ఛిన్నమస్త ఇంట్లో కొలుచుకునే ప్రత్యేక దేవతగా ఆంత ప్రసిద్ధి చెందలేదు. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి పొందడం కొరకై ఈమెను ఉపాసిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీం హ్రీం క్లిం ఐం వజ్రవైరోచనియే హం హం ఫట్ స్వాహా అనే మంత్రాన్ని పఠిస్తారు.

ఈ మంత్రాన్ని శుచిగా కూర్చుని ఏకాగ్రతతో నిష్టగా జపించాలి. శక్తి పాతం తట్టుకునేందుకు సిద్ధపడే వాళ్ళే ఈ ఉపాసన చేస్తారు.

ఛిన్న మస్తిక రూపాన్ని మరో కోణంలో కూడా చూడవచ్చు.

యోగ శాస్త్రం ప్రకారం ఇడ, పింగళ, మరియు సుషుమ్న అనేవి మానవ శరీరంలోని ముఖ్యమైన మూడు ప్రధాన నాడులు. ఇవి శరీరంలోని ప్రాణశక్తిని ప్రవహింపజేసే మార్గాలు. ఇడ నాడి ఎడమ వైపు, పింగళ నాడి కుడి వైపున ఉంటాయి, వీటి మధ్యలో సుషుమ్న నాడి వెన్నెముక మార్గంలో ఉంటుంది. 

ఇడ నాడిని 'చంద్ర నాడి' అని కూడా అంటారు, ఇది శరీరంలో ఎడమ వైపున ఉంటుంది. ఇది శీతలంగా, స్త్రీ శక్తిని సూచిస్తుంది

పింగళ నాడిని 'సూర్య నాడి' అని కూడా అంటారు, ఇది శరీరంలో కుడి వైపున ఉంటుంది. ఇది ఉష్ణంగా, పురుష శక్తిని సూచిస్తుంది.

సుషుమ్న నాడి శరీరానికి కేంద్రంగా, వెన్నెముక మార్గంలో ఉంటుంది. యోగాలో కుండలిని శక్తిని మేల్కొల్పడానికి ఇది ప్రధాన మార్గం. 

మన శరీరంలోని ప్రధాన నాడులుగా ఉన్న ఈ మూడు నాడులు ఏకం అయినప్పుడు, కుండలినీ శక్తి ఒకే ఒక్క చైతన్యంగా సహస్రార చక్రం వైపు ప్రవహిస్తుంది.

ఛిన్న మస్త దేవి పాదాల క్రింద శృంగార భంగిమలో స్త్రీ పురుషుల రతీ మన్మథ రూపం ఉద్దేశ్యం కామ వాంఛల నియంత్రణ గా భావించ వచ్చు.

మనోవికారాలను అణగత్రొక్కి, మూలాధారం లో ఉన్న కుండలినీ శక్తిని చైతన్యవంతం చేస్తూ ఇడ, పింగళ సుషుమ్న నాడులకు సమానంగా ఆ చైతన్యాన్ని ప్రవహింప జేయడం ద్వారా దివ్య యోగ శక్తులను పొందవచ్చునని సూచించే సంకేతంగా కూడా ఈ ఛిన్నమస్తిక విగ్రహ రూపాన్ని చూడవచ్చు.

అందుకే ఈ విగ్రహ రూపం దేవతారాధనగా సాధారణ నిత్యం పూజావిధానంగా గృహాలలో ఆచరించడం జరగడం లేదు. 

ఇది ధ్యాన యోగ ప్రక్రియకు సంకేతం. 

తాంత్రిక విద్యలలో కూడా స్వీయ శిరచ్ఛేద ప్రస్తావన ఉండి ఉండవచ్చు. 

రావణుడు బ్రహ్మను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. తన తపస్సులో భాగంగా 10 సార్లు తన తలను నరికి వేసుకున్నప్పుడు, అతని అంకితభావానికి మెచ్చిన బ్రహ్మ జ్ఞానానికి, శక్తికి గుర్తుగా పది తలల వరం ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా తలను స్వయంగా నరుక్కొని తిరిగి అతికించుకోవడమనే తాంత్రిక విద్య ఒకటి ఉండేదని. సకల విద్యా పారంగతుడైన రావణుడు అనేక మంత్ర తంత్ర విద్యలను పొంది ఈ విధమైన తాంత్రిక తపో శక్తుల ద్వారా బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరాలు పొందాడని పురాణం కథలు సూచిస్తూ ఉన్నాయి. 

కనుక ఛిన్నమస్తిక రూపాన్ని తాంత్రిక శక్తిరూపంగా కొందరు, ఆధ్యాత్మిక యోగసాధనకు చిహ్నంగా కొందరూ భావిస్తారు.


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.


Comments

Popular Posts