ఘరానా దొంగలు
సీతయ్య అనే ఒక బట్టల వ్యాపారి వ్యాపార నిమిత్తం పట్నం వెళ్లి బ్యాంకులో రెండు లక్షలు డ్రా చేసాడు.
తిరిగి వస్తుండగా ఒక నిర్మానుష్య ప్రదేశంలో అతడికి జ్యువెలరీ బాక్స్ రోడ్డు మీద కనిపించింది. దానిని తీసి ఓపెన్ చేసి చూసాడు.
అందులో ఖరీదైన వాజ్రాల హారం కనిపించింది. వెంటనే దానిని తన బట్టల సంచిలో బట్టల మధ్య దాచేసుకుని, ఏమీ తెలియని వాడిలా వెళ్ళిపోతున్నాడు.. నాలుగడుగులు వేసి మలుపు తిరిగే లోపు ఒక ధనవంతుడైన వ్యక్తి ఎదురుపడ్డాడు.
ఈ దారిలో నా జెవెలరీ బాక్సు జారీ పడింది. నీకేమైనా కనిపించిందా అని అడిగాడు.
దురాశపరుడైన బట్టల వ్యాపారి, అబ్బే నాకేమీ కనిపించలేదే అన్నాడు.
కానీ ఆ వ్యక్తి. ఈ దారిలో నువ్వు తప్ప ఇప్పటివరకూ ఎవ్వరూ రాలేదు... నీ చేతిలో ఏమిటా సంచి? ఏముంది అందులో అన్నాడు.
నేను ఊరినుండి వస్తున్నాను. సంచిలో నా బట్టలు ఉన్నాయి... నేను బట్టల వ్యాపారిని అన్నాడు.
నాకు నీమీద అనుమానంగా ఉంది చూపించు అన్నాడు.
నా సంచి నీకెందుకు చూపించాలి నేను చూపించను నన్ను వెళ్ళనీ అంటూ తప్పించుకోబోయాడు బట్టల వ్యాపారి.
మర్యాదగా ఆగు. నీ సంచి తనిఖీ చేయాలి అన్నాడు ఆ వ్యక్తి. ఇంతలో మరో వ్యక్తి వచ్చి ఏమి జరిగిందని అడిగాడు.
నా ఖరీదైన వజ్రాల హారం పెట్టె జారీ పడింది. ఈ రోడ్డులో యితడు తప్ప ఎవరూ రాలేదు. నాకు ఇతడి మీద అనుమానంగా ఉంది. సంచి వెతుకుతాను అంటే వప్పుకోవటం లేదు అన్నాడు.
అప్పుడు ఆ వ్యక్తి. ఏయ్ నేనెవరో తెలుసా మఫ్టీ లో ఉన్న పోలీసుని. మర్యాదగా సంచి చూపిస్తావా నాలుగు తగిలించమంటావా అంటూ గద్దించాడు.
ఆ ధనవంతుడైన వ్యక్తి బట్టల వ్యాపారి చేతిలోనుండి సంచి లాక్కొని వెతికాడు. తన వజ్రాల హారం పెట్టె కనిపించింది.
ఇదిగో నా హారం అంటూ పోలీసుకి చూపించాడు.
పద నడువ్ స్టేషన్కి అంటూ బట్టల వ్యాపారి రెక్కలు విరిచి పట్టుకున్నాడు పోలీసు.
బాబ్బాబూ పొరపాటైపోయింది. బుద్ధి గడ్డి తిని తీసుకున్నాను. అతని పెట్టె అతనికి ఇచ్చేసాను కదా నన్ను వదిలేయ్ అన్నాడు.
అలా ఎలా వదిలేస్తాను. ఇది దొంగ కేసు. నిన్ను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి పద. అన్నాడు పోలీస్.
అప్పుడు బట్టల వ్యాపారి భయపడి, కోర్టు గీర్టు వద్దు. ఎంతో కొంత తీసుకుని వదిలేయండి. అన్నాడు.
ఎంత ఉంది నీ దగ్గర అని అడిగాడు పోలీసు.
తన దగ్గర రెండు లక్షలు ఉన్నాయని చెప్పడానికి తటపటాయించాడు బట్టల వ్యాపారి.
కానీ లేవు అంటే మరేం చిక్కు వస్తుందో అని నిజం చెప్పేసాడు.
సరే అవి ఇచ్చేసి పో అన్నాడు పోలీస్.
రెండు లక్షలా ఇది మరీ అన్యాయం అన్నాడు బట్టల వ్యాపారి.
ఈ వజ్రాల హారం ధర యాభై లక్షలు చేస్తుంది. నీ మీద కేసు బుక్ చేసి లోపలేస్తే బయటకి రావడాన్ని పది లక్షలు ఖర్చు అవుతుంది. రెండు లక్షలతో బయటపడుతున్నావ్ సంతోషించు. అన్నాడు పోలీస్
చేసిది లేక ఆ రెండు లక్షలూ పోలీస్ చేతిలో పెట్టబోయాడు బట్టల వ్యాపారి.
సరిగ్గా అదే సమయానికి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. అందులోనుండి అయిదుగురు పోలీసులు దిగి, ఆ మఫ్టీ పోలీసుని ధనవంతుడిని పట్టుకున్నారు.
వీళ్ళిద్దరూ దొంగలు. దారిన పోయేవాళ్ళని మోసం చేస్తూ డబ్బు కాజేస్తుంటారు. మేము డ్రోన్ సహాయంతో ఇక్కడ నిఘా పెట్టి జరిగినదంతా చూసి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళని పట్టుకుంటున్నాం.
తేరగా వచ్చే వాటికోసం ఆశ పడేవాళ్ళే వీళ్ళ టార్గెట్. ఇకనైనా ఇలాంటి వాళ్ళ బుట్టలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. అంటూ వాళ్ళను జీప్ ఎక్కించుకుని తీసుకు పోయారు పోలీసులు.
సీతయ్యకి తలతిరిగినట్లయింది... ఆ అసలు పోలీసులు రావడం కొన్ని క్షణాలు ఆలస్యమైనా తాను రెండు లక్షలు పోగొట్టుకునేవాడు. అవకాశం దొరికింది కదా అని అత్యాశకు పోకూడదు. తాను నిజాయితీగా ఉండి ఉంటే ఇలాంటి మోసగాళ్ళకు చిక్కే వాడు కాదు కదా. తన అత్యాశే తనని వాళ్ళ బారిన పడేలా చేసింది.
అయినా నిజంగా ఎవరైనా తన విలువైన వస్తువు పోగొట్టుకుంటే తానెందుకు తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే తానుకూడా దొంగపనికి పాల్పడినట్లు కదా... చిఛీ... ఇకపై నిజాయితీగా బ్రతకాలి. అప్పణంగా వచ్చే వాటికోసం ఆశపడకూడదు. అనుకుని భారంగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.
Comments
Post a Comment