మంచి దొంగ

బుచ్చిబాబు నీర్సంగా వాళ్ళ మామయ్య ఇంటికి వచ్చాడు.
అతడి వాలకం చూడగానే వాళ్ళు మావయ్యకి అర్థమైపోయింది.

రావోయి అల్లుడూ ఏంటి నీర్సంగా మొహం పెట్టావ్ మళ్ళీ గొడవలా? అన్నాడు వాళ్ళ మామయ్య జగన్నాథం 

ఏం చెప్తాం మావయ్యా... ఈ బాధలు భరించలేక పోతున్నామనుకో... అన్నాడు బుచ్చిబాబు.

నేను పడే బాధల్తో పోలిస్తే నీవి కూడా ఒక బాధలేనట్రా... పెళ్ళాలు అలాగే అంటార్రా మనం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. అన్నీ ఎక్కడ పట్టించుకుని కూర్చుంటాం. అన్నాడు జగన్నాథం.

ఎలా వదిలెస్తాం మావయ్యా రోజూ మాటలతో హింసిస్తుంటే... అన్నాడు బుచ్చిబాబు.

అరేయ్... నేను పడ్డ హింసలతో పోలిస్తే నువ్వు పడుతున్నవి కూడా హింసలేనట్రా... నా ప్లేసులో మరొకడుంటే...

ఉంటే... అత్తయ్యని చంపేసేవాడా...?

కాదురా వాడే భరించలేక చచ్చేవాడు. సహనమే పురుషుడికి అలంకారం తెలుసుకో.

సిగ్గే స్త్రీలకి సింగారం అనే మాట విన్నాను గానీ... సహనమే పురుషుడికి అలంకారం అని కొత్తగా నీ నోటినుండే వింటున్నాను.
ఆ అలంకారం నాకొద్దులే మావయ్యా... అన్నాడు బుచ్చిబాబు.

ఇంతకీ ఈ గొడవకి కారణం ఏమిటంటే... బుచ్చిబాబు కూరలకి వెళ్ళి, డబ్బులిచ్చి వంకాయలు, బెండకాయలు సంచిలో వేసుకోవడం మరచిపోయి అక్కడే వదిలేసి వచ్చేసాడు.

భార్య మీనాక్షి అతడు మతిమరుపు మనిషంటూ ఒకటే నసపెట్టి... దుమ్మెత్తి పోసింది.

ఆ తిట్ల దండకం వినలేక మావ గారి ఇంటికి వచ్చి మొరపెట్టుకున్నాడు బుచ్చిబాబు.

ఏవిటి అల్లుడూ సింగారం, అలంకారం అంటున్నావు... అమ్మాయికి ఏవైనా నగలు కొంటున్నావా... అంటూ కాఫీ పట్టుకొచ్చింది అత్తగారు కాంతమ్మ.

అబ్బే... అలాంటిదేం లేదత్తయ్యగారూ... అన్నాడు పుసుక్కున బుచ్చిబాబు.

అవునవును నువ్వెప్పుడు కొనాలి గనక. ఏదో మా అమాయకత్వంతో అడుగుతాం గానీ... మీ మగాళ్ళు మా ఇష్టాఇష్టాలు పట్టించుకునేదెప్పుడూ...‌ అంటూ భర్త జగన్నాధం వైపు ఓ చూపు చూసింది కాంతమ్మ.

ఇది బాగుంది ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు. అన్నాడు జగన్నాథం.

ఆ... ఒప్పుకున్నారు కదా మీరు మంగలం అనీ... అంతా నా ఖర్మ అంటూ రుసరుసా లోపలికి వెళ్ళిపోయింది కాంతమ్మ.

మంగళం అంటే ఏంటి మావయ్యా... అని అడిగాడు బుచ్చిబాబు.

మంగలం అంటే... వేపుడు వేయించుకునే కుండ మూకుడురా.
చూసావా మీ అత్తయ్య నన్ను ఎలా వేచుకు తింటోందో... అన్నాడు జగన్నాథం.

విన్నాను మామా విన్నాను... ఇచ్చిన మర్యాద తక్కువయే కాక... జగచ్చరిత పరాక్రమ వంతులైన మా మగవారినే తూలనాడు చుంటిరిగా ఈ మగువలు... ఎంత మదమెంత కావర మెంత పొగరు! అంటూ ఇంకా ఏదో అనబబోయాడు.

ఒరేయ్ ఇలాంటి డైలాగు ఎక్కడో విన్నట్టుందిరా... అంటూ ఆలోచిస్తూ తల పైకెత్తాడు జగన్నాథం.

ఎక్కడో కాదులే మావయ్యా... మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఎస్వీ రంగారావు డైలాగ్.

విన్నాను మాతా విన్నాను... ఇచ్చిన మాట తప్పుటయే గాక తుచ్ఛ కౌరవుల పొత్తు కలుపుకుని, జగత్చరిత పరాక్రమవంతులైన మా జనకులనే తూలనాడినారు కదా యాదవులు... ఎంత మదమెంత కావర మెంత పొగరు...

ఆ.. గుర్తొచ్చింది గుర్తొచ్చింది... బాగా చెప్పావురా... నీలో మంచి రైటర్ ఉన్నాడుసుమీ... అన్నాడు మావయ్య జగన్నాథం.

నువ్వూరుకో మావయ్యా... నేను చేస్తున్న పనే అది. అన్నాడు బుచ్చిబాబు.

ఓహ్... అవును కదూ మర్చిపోయాను. అవునురా... ఎప్పుడూ నీ సీరియల్ కథల్లో విలన్లని ఆడవాళ్ళనే పెడతావేం. అడిగాడు జగన్నాథం 

పెళ్ళికి ముందు విలన్లుగా మగవాళ్ళని పెట్టి రాసేవాడిని మావయ్యా... పెళ్ళయ్యాకే ఇలా... అన్నాడు బాధగా మొహం పెట్టి.

అంతే కదూ... నీ అనుభవాన్ని రంగరించి రాస్తున్నావన్న మాట. అందుకే అంత హిట్టై చస్తున్నాయి ఆ కథలు. అని నవ్వాడు జగన్నాథం.

సరే మావయ్యా ఇంక ఇంటికెళ్తాను. వెళ్ళొస్తానత్తయ్యా... అంటూ అరిచి బయటికి నడిచాడు బుచ్చిబాబు.

ఇంటికి తిరిగి వచ్చాడు.

ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. ఇంట్లో లైట్లు వెలగడం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.

చెప్పులు చప్పుడు కాకుండా విప్పి నెమ్మదిగా ఇంట్లోకి వచ్చాడు. బుచ్చిబాబు. 

నెత్తిమీద ఠపీ మని ఒక దెబ్బ. ఠంగ్ మని సౌండ్... కళ్ళముందు నక్షత్రాలు కనిపించి క్రింద పడిపోయాడు బుచ్చిబాబు.

పడిపోతూ పడిపోతూ... ఎందుకే ఇంత గట్టిగా కొట్టావ్... ఇప్పుడేమయ్యిందినీ... అంటూ పడ్డాడు.

తిరిగి మెలకువ వచ్చి చూసే సరికి ఎదురుగా భార్య మీనాక్షి. స్తంభానికి కట్టబడి ఉంది. ఆమెకు నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి

అదేంటే నిన్ను ఎవరు ఇలా కట్టేశారు? అనబోయాడు. అప్పుడే తెలిసింది తనని కూడా కట్టేశారని, తన నోట్లో కూడా గుడ్డలు కుక్కారని.

ఆందోళనగా చుట్టూ చూసాడు. 
ఏంటమ్మా ఇంట్లో ఒక్క నగ కూడా లేదు... కనీసం వెయ్యి రూపాయలు సొమ్ము కూడా లేదు. ఎలా కాపురం చేస్తున్నావమ్మా నీ మొగుడితో.

ఏమయ్యా... పెళ్ళానికి నగనట్రా చేయించకుండా ఎలా ఉన్నావయ్యా... చిఛీ... నువ్వేదో పెద్ద ఉద్యోగస్తుడివి, పైగా టివి సీరియళ్ళు కి కథలు గట్రా రాసేటోడివని తెలిసి... బోల్డంత కూడబెట్టి ఉంటావని అనుకుని వచ్చి మోసపోయాం. ఇప్పుడు మా ఆడాళ్ళకి ఏం చెప్పుకోవాలి. నీవల్ల వాళ్ళతో తిట్లు తినాలి. ఆల్లెత్తుకునే తిట్ల పురాణం ఎట్టా తట్టుకోవాలి.

ఏడనైనా రగస్యంగా దాచుకునుంటే చెప్పుండ్రీ అట్టుకుపోతాం. అంటూ అడిగాడు ఒక దొంగ.

ఇట్టా మంచిగా అడిగితే ఎట్టా చెప్తారు రా... నాలుగు పీకితే... అంటూ లేచాడు మరో దొంగ.

ఊ... ఊ... అంటూ చేతి వాచీ చూపించాడు బుచ్చిబాబు.

ఛీ... బోడి పాత వాచీ ఎవడికి కావాలి బే... కనీసం ఉంగరాలు కూడా లేవు చేతికి... ఏం మనిషివయ్యా...

పదరా పోదాం మన టైము వేస్టు.... అంటూ వెళ్ళిపోయారు దొంగలు.

తెల్లవారింది... పాలు పొయ్యడానికి వచ్చిన కుర్రాడు. వీళ్ళ అవస్తను చూసి, వచ్చి కట్లు విప్పాడు.

బ్రతుకు జీవుడా అనుకున్నారు ఇద్దరూ.... అవునూ... ఇంతకూ నగలూ డబ్బులూ ఏమయ్యాయి? అడిగాడు బుచ్చిబాబు.

ఆ దొంగలకి మీకు మల్లే బుద్ధి లేదు. లాకర్ వదిలేసి గూడ్లన్నీ వెతికారు. అంది మీనాక్షి.

అదేంటే లాకర్ కూడా తెరిచే ఉంది కదా... అన్నాడు బుచ్చిబాబు.

ఆ లాకర్ కాదండీ... దేవుడి మందిరం క్రింద దాచిన పసుపు కుంకాల డబ్బా అంది మీనాక్షి.

బుచ్చిబాబు షాకయ్యాడు... ఎంత తెలివి! అక్కడ దాచాలనే ఆలోచన ఎలా వచ్చిందే నీకు! అడిగాడు 

ఈమధ్య కాలనీలో దొంగలు తిరుగుతున్నారని పనిమనిషి చెప్పింది. అందుకే ఎందుకైనా మంచిదని ముందే లాకర్ ఖాళీ చేసాను.

ఎంత దొంగలైనా పాప భీతి ఉంటుంది. దేవుడు, దెయ్యం లాంటి భయాలు ఉంటాయి. పూజామందిరం వైపు చూసినా దాని క్రింద ఉన్న పసుపు కుంకాల డబ్బాని టచ్ చెయ్యరనే ధైర్యంతో అలా చేసాను అంది మీనాక్షి.

తిడితే తిడతారు గానీ... అబ్బో ఈ ఆడవాళ్ళకి ఉన్నంత తెలివి మనకెక్కడ ఉండి చచ్చింది అనుకున్నాడు బుచ్చిబాబు.

యధావిధిగా స్నానం చేసి ఆఫీసుకు తయారయ్యాడు బుచ్చిబాబు. భోజనం వడ్డించింది మీనాక్షి. 

కంచంలో వంకాయ కూర చూసి మళ్ళీ షాకయ్యాడు బుచ్చిబాబు.

నేను నిన్న తేవడం మర్చిపోయాను కదా ఎలా వచ్చాయి వంకాయలు. అడిగాడు బుచ్చిబాబు.

మీరు అక్కడ మర్చిపోలేదు. మీ స్కూటర్కి తగిలించి ఉంచి తియ్యడం మరిచారు... పొద్దుటే వరండా తుడుస్తూ చూసాను. అంది మీనాక్షి.

హమ్మయ్య బ్రతికాను అనుకున్నాడు బుచ్చిబాబు.

సాయంత్రం తలుపు చప్పుడయింది. ఎవరా అని తీసి చూస్తే దొంగ.... ఆడ కూతురు మెడ బోసిగా ఉండకూడదని... చెల్లెమ్మకి ఈ గొలుసు తెచ్చినా... బంగారు గొలుసే... గానీ దొంగ సొత్తు కాదు.... నేను ఈ వృత్తిలో దిగక ముందు మా చెల్లాయికి కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో చేయించినది... అది నాకు చెప్పకుండా ఎవడినో ప్రేమించి ఎల్లిపోనాది. అప్పటినుండి దేవుడి గూట్లో దాచి ఉంచినా... నాకు దీని అవసరం లేదులే... నా పెళ్ళాం కూడా ఇచ్చి రమ్మంది. మేమెంత దొంగోళ్ళమైనా మనుషులమే... లేనోళ్ళ కష్టం చూడలేం. ఇక మీదటైనా పైసలు కూడబెట్టి చెల్లెమ్మని మంచిగా చూసుకో. ఆడాళ్ళు బోసిగా ఉండకూడదు. కొద్దిగా నైనా మెడలో బంగారంతో ఉండాలి. వాళ్ళ సరదాలలని మనం అర్థం చేసుకుంటేనే మన కష్టాలని వాళ్ళు అర్థం చేసుకుంటారు సారూ. ఇది చెల్లెమ్మకి ఇవ్వు. అంటూ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు దొంగ.

ఎంత మంచి దొంగ... ఈ దొంగ ఇచ్చిన సందేశం మీద ఒక కథ రాయాలి అనుకుంటూ తలుపు వేసుకున్నాడు బుచ్చిబాబు.

Comments

Popular Posts